కోరాడ రామచంద్ర శాస్త్రిగారు
( తొలి స్వతంత్ర తెలుగు నాటక రచయిత)
కోరాడ వంశాన్ని మహోజ్వలం చేసినవారు కోరాడ రామచంద్రశాస్త్రి గారు. ఈయన యువ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ దశమి (12/10/ 1815) గోదావరి జిల్లా అమలాపురం తాలూకా కేసనకుర్రు గ్రామంలో లక్ష్మణ శాస్త్రి, సుబ్బమాంబలకు జన్మించారు. 12వ ఏట తండ్రి వద్ద శ్రీరామ మంత్రం ఉపదేశం పొందారు. రఘువంశం, తరువాత కావ్యవ్యాకరణాదులు అభ్యసించారు. శిష్టు కృష్ణమూర్తి శాస్త్రిగారి వద్ద అలంకార శాస్త్ర గ్రంధాలు చదువుతూ, అతి త్వరలోనే కవిత్వం చెప్పడం అలవరచుకున్నారు. ఇంగువ రామస్వామి శాస్త్రి అనే గొప్ప మంత్రశాస్త్రవేత్త వద్ద మంత్రశాస్త్ర గ్రంధాలు చదివారు. మిత్రుల ప్రోద్బలంతో సంపాదనకై చెన్నపట్నం వెళ్ళడానికి సిద్ధమయ్యారు. దారిలో బందరు (మచిలీపట్నం) చేరారు. అక్కడ మిత్రులు వారిని ప్రయాణం ఆపివేయించి, నోబిల్ గారితో ఈయన పాండిత్యాదులు చెప్పి, బందరు నోబిల్ పాఠశాలలో పండిత పదవిలో నియమించారు. శాస్త్రిగారు అది మొదలు ఆ పాఠశాలలో ఒకే రీతిగా, నలభైమూడేండ్ల పాటు అధికారుల మన్నన పొందుతూ, ఆ పాఠశాల కళాశాలగా మారినపుడు దానిలో ప్రధానాంధ్ర పండితులయి, తమ కాలమంతా అధ్యాపనంలోనూ, గ్రంథరచనలోనూ వెళ్లబుచ్చారు. శార్వరి సంవత్సర శ్రావణ మాస బహుళ పాడ్యమి (11/08/1900 ) నాడు కీర్తికాయులయ్యారు.
శ్రీ రామచంద్ర శాస్త్రిగారు మప్పైకి పైగా సంస్కృతాంధ్ర గ్రంధాలు రచించారు. సంస్కృత భాషలో గంభీర భావాలతో, రమణీయ కల్పలనతో మధురతర శైలిలో ఇన్ని గ్రంధాలు రచించిన వారు అరుదు. ఈయన తెలుగులో రచించిన గ్రంధాలు తెలుగు నాడంతటా ఎక్కువ ప్రచారం కాకపోయినా, ఆంధ్రవాఙ్మయంలో నూతన శాఖలకు దారితీసినవాడు ఈయనే అని చాటుతున్నాయి. శాస్త్రిగారి రచనలలో 'ఘనవృత్తం' అనే సంస్కృత కావ్యం, 'మంజరీ మధుకరీయం' అనే తెలుగు నాటకం ప్రసిద్ధాలు.
సంస్కృత గ్రంధాలు: 1) కుమారోదయచంపు - ఇరవైయేడుల్లాసాల మహా కావ్యం 2) శృంగార సుధార్ణవ భాణం 3) రామచంద్ర విజయవ్యయోగం 4) ధిసౌధం - సంస్కృతం అభ్యసించే విద్యార్థులకు అనుకూలంగా సులభశైలిలో వ్రాసిన వ్యాకరణం 5)శృంగార మంజరి 6) కమనానంద బాణం 7) పుమర్థ సేవధి కావ్యం 8) దేవీ విజయచంపు 9) మృత్యుంజయ విజయకావ్యం 10) ఉత్తర రామాయణం 11) త్రిపురాసుర విజయ డిమం 12) రాజవంశం 13) మంజరీ సౌరభం 14) భాష్యార్థ సంగ్రహం 15) దేవీస్తవం 16) శ్రీ కృష్ణోదయం 17) కందర్పదర్పం 18) వైరాగ్య వర్ధని 19) ఉపమావళి 20) ఘనవృత్తం - కాళిదాస కృత మేఘ సందేశోత్తర కథాభాగరూపం 21) కవి కంఠపాశ వ్యాఖ్య - మూలం కాళిదాస విరచితం 22) అమృతానంద యోగి విరచిత సర్వాలంకార సంగ్రహ వ్యాఖ్య.
ఆంధ్రీకృత గ్రంధాలు : 23) ఉన్మత్తరాఘవము - భాస్కర కవికృతం 24) ముద్రారాక్షసము 25) శాకుంతలము 26) వేణీ సంహారము 27) ఉత్తర రామచరితము 28) రాథాఅంగదూతము 29) నయప్రదీపము -విష్ణుశర్మ విరచిత పంచతంత్రంలోని 'విగ్రహము' నకు తెనుగు.
స్వతంత్రమైన తెలుగు రచనలు: 30) మంజరీ మధుకరీయము 31) పరశురామ విజయము - వచనం
రామచంద్ర శాస్త్రిగారికి ముగ్గురు కుమారులు - లక్ష్మీ మనోహరం, రామకృష్ణ శాస్త్రి, దుర్గా నాగేశ్వర శాస్త్రి అనేవారు; ఇద్దరు కుమార్తెలు. లక్ష్మీ మనోహరంగారు ప్రభుత్యోద్యోగం చేశారు. రామకృష్ణ శాస్త్రిగారు సంస్కృతములో అమోఘమైన పాండిత్యం సంపాదించారు. ఎంతో కీర్తిమంతులు కావలసిన వారు అల్పవయసులోనే మరణించారు. దుర్గా నాగేశ్వర శాస్త్రిగారు తండ్రినిమించిన తనయులు. కళాశాలలో మెట్రిక్యూలేషన్ చదువుతూనే, తండ్రివద్ద సంస్కృతం అభ్యసించారు. స్వల్పకాలంలోనే సర్వశాస్త్ర పారంగతులయ్యారు. యోగాభ్యాసానిరతులు, నిరాడంబరులు, పరమార్థ విషయైక దృష్టికలవారు. తండ్రిగారి అనంతరం తండ్రిగారివలెనే దాదాపు 33 సంవత్సరాలు బందరు నోబిల్ కళాశాలలో పండితులుగా పనిచేసారు.
శ్రీ కోరాడ రామచంద్రశాస్త్రిగారి రచనలు::
సంస్కృతం:
తెలుగు:
ఆంధ్ర అనువాదములు:
శ్రీ కోరాడ రామచంద్రశాస్త్రిగారి గ్రంథాలు
Concept, design & development by Dr. Venkat Korada
Copyright © 2020 Dr. Venkat Korada - All Rights Reserved
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.