శ్రీ కోరాడ రామకృష్ణయ్య
శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు తెలుగు పరిశోధనా వైతాళికులుగా వెలసిన సాహితీవేత్తలు. ఆంధ్రభాషా సాహిత్యపరిజ్ఙానంవల్ల మనం సంపాదించిన భాషాసాహిత్య విమర్శన పద్ధతుల్ని మన భాషాసాహిత్య పరిణామం పట్ల సమన్వయించి వివరించటం వారి పరిశోధన లక్ష్యం.
శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు ఖరనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి - 1891 అక్టోబరు 2వ తేదీన - వేదాధ్యయన పరులైన శిష్టాచారా సంపన్నుల వంశంలో జన్మించారు. వారి తాతగారు రామచంద్రకవిగారు, పినతండ్రి నాగేశ్వర శాస్త్రులుగారు నోబిల్ కాలేజీలో సంస్కృతాంధ్ర పండితులుగా పనిచేసారు. బాల్యంలో రామకృష్ణయ్యగారు తాతగారి గాంభీర్యగౌరవములు, గ్రంథరచనావ్యగ్రత, ఆయన పాండిత్య ప్రభావాదుల యెడల చుట్టుపట్ల వారికి గల గౌరవాభిమానములు గుర్తించారు.
వారు మూడవఫారంవరకు బందరు హిందూహైస్కూల్ లోను, నాల్గవఫారం నుంచి నోబిల్ కాలేజీలోనూ చదివారు. అప్పుడు పినతండ్రి కాలేజీలో పండిత పదవిలో ఉన్నారు. ఇంటిదగ్గిర వీరికి పినతండ్రిగారి వద్ద శాస్త్రకావ్య పాఠాలు చదివేవారితోపాటు సంస్కృత విద్యాభ్యాసం. వారి ఇల్లుకూడా ఎప్పుడూ ఒక పాఠశాలగా ఉండేదట. పొద్దున్నే స్నానం, ఏ రెండుగంటలో జపం అయినది మొదలు భోంచేసేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడూ, మధ్యాహ్నం విరామపు గంటలోనూ, మరల సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడూ, రాత్రి పదిగంటల వరకూ ఎవరో ఒకరు ఏదో ఒక పాఠం చదువుతూనే ఉండేవారట, పినతండ్రి నాగేశ్వర శాస్త్రిగారి వద్ద.
B. A. పరీక్ష అయిన వెంటనే విజయనగరం కాలేజీ నుంచి పిలుపు వచ్చింది; రెండు భాషలలో B. A. ప్యాసయినవారు వాళ్ళకి కావలసివచ్చింది. అక్కడ B. A. Part III విద్యార్థులకు సంస్కృత భాషా శాస్త్రము, ద్రావిడ భాషా వ్యాకరణము పాఠ్యంశాలుగా ఉండేవి. ఇది ఒక్క విజయనగరం కాలేజీలోనే కానీ తక్కిన రాజముండ్రి, బందరు కళాశాలలో లేదు. కాలేజీలో విధ్యార్థులకీ విషయాలు బోధించవలసి ఉండడంవల్ల భాషాశాస్త్ర విషయంలో ఈయన కొంత శ్రద్ధతో కృషి చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఆకాలంలో కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా ఉన్న శ్రీ ఉల్లాల్ సుబ్బరాయ భట్టు గారితో సన్నిహిత పరిచయం, తరచు వారితో ద్రావిడభాషా తత్వాన్ని గురించి, కన్నడ తుళు భాషలను గురించి చేస్తూండిన చర్చలు వీరి ద్రావిడభాషాశాస్త్రాభిమానాన్ని , తత్తత్త్వ పరిశీలనా కుతూహలాన్ని విశేషంగా పెంపొందించాయట. తత్ఫలితంగా వారాకాలంలో పెక్కు మౌలిక మైన వ్యాసాలను ప్రచురించారు. ద్రావిడభాషలకు సంబంధించినవేకాక సాహిత్య సంబంధమైన రచనలు కూడా అనేకం చేశారు, శ్రీనాధుడి భీమేశ్వర పురాణం, రసచర్చ మొదలైనవి. 1924లో ప్రిన్సిపాలు శ్రీ రామానుజస్వామి గారి ప్రోద్బలంతో మద్రాసులో జరిగిన అఖిలభారత ప్రాచ్య మహాసభలకు సభ్యులుగా వెళ్లారు. అప్పటినుండి ఈ సమావేశాలకు తరచు వెడుతూండేవారు. 1941లో తిరుపతి సమావేశంలో తెలుగు విభాగానికి, 1947లో దర్భాంగాలో జరిగిన సమావేశంలో ద్రావిడ భాషా విభాగానికీ అధ్యక్షత వహించారు.
ఇంతలో 1927లో మద్రాసు యూనివర్సిటీలో ప్రాచ్యపరిశోధనా సంస్థ ఒకటి స్థాపించబడింది. తమిళం, తెలుగు, కన్నడ, మళయాళ భాషా శాఖలు ఏర్పడ్డాయి. శ్రీ రఘుపతి వేంకటరత్నం నాయుడుగారు అప్పుడు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. ద్రావిడ భాషల విషయంలో కొంత అనుభవము, పరిశోధనా దృష్టి కలవారిని తీసుకోవాలని వారి అభిప్రాయం. ఈ రూపంగా వారు విజయనగరంలో పనిచేస్తున్న రామకృష్ణయ్యగారిని గురించి తెలుసుకోవడం, అప్పుడు విజయనగర సంస్థానం దివానుగా పనిచేస్తున్న శ్రీ మామిడిపూడి వెంకటరంగయ్యగారి ద్వారా రామకృష్ణయ్యగారిని ఆహ్వానించడం, వారు మద్రాసు యూనివర్సిటీలో చేరడం జరిగింది.
మద్రాసు యూనివర్సిటీలో వారు 22 ఏళ్ళు పనిచేసారు. అక్కడ పదవీ విరమణ తరువాత TTD Executive Officer శ్రీ చెలికాని అన్నరావుగారి ఆహ్వానం మీద 1950 లో తిరుపతి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధన సంస్థలో చేరి ఆరు సంవత్సరాలు పనిచేసి 1956 లో రిటైర్ అయ్యారు. 1962 మార్చి 28 తేదీన స్వర్గస్థులయ్యారు.
శ్రీ రామకృష్ణయ్యగారి జీవితం నిరంతర భాషా సాహిత్య వ్యాసంగంలో సాఫీగా జరిగిపోయింది. ఆయన ఆరోగ్యంగా ఉండేవారు. అందరి యెడల సుహృత్భావంతో మెలిగేవారు. ఇతరులు వీరి యెడల గౌరవ ఆదరాభిమానాలతో ఉండేవారు. అదొక పుణ్యవిశేషం.
శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారి రచనలు:
తెలుగు సాహితీ విమర్శ రచనలు:
తెలుగు భాష,చరిత్ర పై రచనలు::
అనువాదములు - విమర్శనాత్మక రచనలు - ఇతరములు :
1915 నుంచి 1956 వరకు - ఈ నాలుగు దశాబ్దాలూ వారు ఆంధ్ర భాషావాఙ్మయ పరిశోధనలో నూతన దృక్పధాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి రచనలు సాగించారు.మద్రాసు యూనివర్సిటీలో తెలుగు శాఖ చేపట్టవలసిన పరిశోధనా కార్యక్రమము: ఆంధ్ర భాషా సాహిత్యముల పరిణామము నన్వేషించి, వాటి ప్రత్యేక లక్షణములు, విశిష్ఠత ఎట్టివో వ్యక్తపరచవలసి యున్నదని తలచి, దానికి మూలాధారమైన ఆంధ్ర భారతము గనుక, దానిలో పరిశోధన ప్రారంభించారు. తత్ఫలితంగా రెండేళ్లలో 'ఆంధ్రభారత కవితా విమర్శనము' అనే గ్రంథాన్ని 1929 లో ప్రచురించారు. అప్పటి పత్రికలన్నీ ఈ గ్రంథాన్ని ముక్తకంఠంతో ప్రశంసించాయి. ఇది మహారంజకమై పాఠకులపైనా, తరువాతి భారత విమర్శకులపైనా చెరగని ముద్ర వేసింది.
గ్రంథసమీక్షలు:
Hindu: "We cannot be too grateful to Mr. Ramakrishnayya for taking up the task of paying a pious tribute to the memory of the Telugu poets of the Mahabharata... His method of treatment is exceedingly interesting. His enumeration of the artistic qualities of Tikkana's verse show rare insight and critical acumen."Journal of the Andhra Historial Research Society: "We think literary criticism should flow hereafter on the lines suggested by Ramakrishnayya."
Tekumalla Achyuta Rao: "Excellent exposition of the subject which is new in the field of Telugu literary criticism."
Burra Seshagiri Rao, Prof of English, Maharaja College, Vijayanagaram: "His work will last for all time to his credit"
భారత విమర్శనంలో వలె మన సాహిత్యంలో నూతన పద్ధతులను అనుసరించవలసిన ఆవశ్యకతను వ్యక్తంచేయడానికి 'కాళిదాసుని కళా ప్రతిభలు', 'సారస్వత వ్యాసాలు' మొదలైన విమర్శక వ్యాసాలు ప్రకటించారు.
ఇక భాషా విషయం:
దక్షిణదేశ భాషల విషయమైన పరిశోధన మప్పటికింకా కొత్త మార్గమే అవడం వల్ల అక్కడ చేయదగిన పనులను గూర్చి పలువురు పలువిధాలుగా అనుకునేవారట. రామకృష్ణయ్యగారు ఆంధ్రభాషా చరిత్రాన్వేషణకు ద్రావిడభాషా తత్వ పరిశీలన ముఖ్యసాధనమని తలచి తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలను కనుగొనడానికి ప్రయత్నించారు. వారి 'Studies in Dravidian Philology' అనే గంథం ద్రావిడ భాషలలోని నామ, క్రియా విభక్తి స్వరూపాన్ని నిరూపిస్తుంది. తెలుగు సంస్కృత భవతే అని తలచి సంపూర్ణంగా సంస్కృత వ్యాకరణ ఫక్కీనే తెలుగు వ్యాకరణం రచించిన తెలుగు పండితుల దురభిప్రాయాలను తొలగించి, తెలుగు వ్యాకరణ విశేషములను భాషాచారిత్రక పద్దతిని సమన్వయించి చూపటానికి అనేక విమర్శ వ్యాసాలు, గ్రంథాలు రచించారు. 'సంధి', 'భాషోత్పత్తిక్రమము-భాషాచరిత్రము' మొదలైన రచనలు ఈ దృష్టితో చేసినవే. వ్యాకరణం బోధించే పండితులకు తెలుగు వ్యాకరణ సూత్ర బోధన విషయమున చారిత్రక దృక్పధం ఏర్పడాలని ఆయన ఆశయం.
భాషావిషయంలో వలెనే సాహిత్యచ్ఛన్దో విషయాలలోకూడా సంస్కృతం నుండి వచ్చి చేరిన సంప్రదాయ ఫక్కీకి భిన్నమై దక్షిణదేశీయ భాషలకు సహజమైన సంప్రదాయ ఫక్కీ ఒకటి ఉన్నదనీ, అది సంస్కృత సంప్రదాయ ప్రాబల్యం వలన మాటు మణిగి పోయినదనీ, కాబట్టి దేశీయ సంప్రదాయ సిద్ధమైన వాఙ్మయాన్ని పునరుద్ధరించవలసి ఉన్నదనీ వారు 1940 ప్రాంతంలో ఉద్ఘాటించారు. 'దక్షిణ దేశ భాషా సారస్వతములు - దేశి' అనే గ్రంథంలో తెలుగులో ఉపజాతి ఛందస్సును తమిళ కన్నడ ఛందస్సుతో పోల్చిచూస్తే ఆ దేశీయ ద్రావిడమైన ఛందో ఫక్కీ బయలుపడుతుందనీ కుడా వారా గ్రంథంలో ప్రకటించారు.
ఈ విషయాన్ని ఇంకా 'Telugu Literature outside the Telugu Country' అనే గ్రంథంలో ప్రచురించారు. దక్షిణాంధ్ర వాజ్మయ యుగంలో దేశి సాహిత్య పునరుద్ధరణ, ఆధునిక తెలుగు సాహిత్య లక్షణాలుగా పరిణమించిన కొన్ని సాహిత్య శాఖల అభివృద్ధి నాయకరాజుల చలవే. తరువోజ వంటి దేశీ వృత్తాలు యెంత సులభంగా గానయోగ్యాలవుతాయో, లేక బహుశా మొదట రాగతాళ లయలతో ఉన్న దేశీ ఛందస్సులే తర్వాత వృత్తాలుగా తీర్చబడినాయా - అనే విషయాలు ఈ గ్రంథంలో నిరూపించబడ్డాయి. 'ముసలమ్మ పాడే పాటలలోను, బిచ్చగాళ్ళు వీధులలో పాడే పాటలలోను, కార్మికులు, కర్షకులు పొలాలలో పాడే పాటలలోను తెలుగులోని పాత దేశీ ఛందస్సు ఇంకా సురక్షితమై ఉందని మనం విశ్వసించవచ్చు' అని ఈ గ్రంథం మనకు హామీ ఇస్తున్నది.
రామకృష్ణయ్యగారు మద్రాసు విశ్వవిద్యాలయ సంస్థలోను, తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రాచ్యపరిశోధన సంస్థలోను తెలుగులో కొన్ని ప్రాచీన కావ్యాలను పరిష్కరించి విపుల పీఠికలతో ప్రకటించారు. విష్ణుమాయానాటకము, విష్ణు పురాణం, నవనాధ చరిత్ర, వళ్ళబాభ్యుదయం, నన్నెచోడుని కుమారసంభవం మొదలైనవి. తిరుపతిలో శ్రీనివాస విలాససేవధి (ద్విపద), వెంకటాద్రి మాహాత్మ్యం, శ్రీ అన్నమాచార్యపై వ్యాసాలు ప్రచురించారు.
'Telugu Language of the First Millennium A.D. (ప్రజ్ఞన్నయ యుగంలో తెలుగు భాష)' అనే రచన తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రాచ్యపరిశోధనాలయం జర్నల్ లో ధారావాహికంగా ప్రచురితమైంది. క్రీస్తుశకం పదవశతాబ్ది అంతం వరకు ఉన్న శాసనాలు ఆధారంగా రచింపబడిన మొదటి ప్రాచీనాంధ్ర చారిత్రిక వ్యాకరణం ఇది.
Annals of Oriental Research మొదలైన పత్రికలలో ద్రావిడ భాషా వ్యాకరణం గూర్చిన ప్రామాణిక వ్యాసాలు అనేకం ఉన్నాయి: The Dravidian phonetics, (the Antasihas in Dravidian languages,?), Dravidian Inflexion, The Dravidian infinitive, The Dravidian Passive, Dravidian languages and Prakrits, uncultivated languages of the Dravidian family, Dravidian verb, Root theory and the root in Dravidian languages, తెలుగు పదములు - వాని నిష్పత్తిక్రమము, తెలుగు పలుకుబళ్లు, ఉత్తర హిందుస్థాన భాషలు - దేశి, ద్రావిడ భాషా లక్షణము - తొల్కాప్పియం, ఇత్యాది. ఈ వ్యాసాలు, గ్రంథాలవల్ల తెలుగు భాషా స్వరూప పరిణామములను గురించి సరియైన అవగాహనను విద్యాధికులలోనూ, విద్యార్థులలోనూ పెంపొందించడానికి తోడ్పడినవి.
రామకృష్ణయ్యగారు మన సంస్కృతికి సంబంధించిన అతిముఖ్యమైన వ్యాసాలను ఎన్నింటినో ప్రచురించారు. మన సాహిత్యంలో కవులు వర్ణించిన వివాహ సంప్రదాయాలు, తాళిబొట్టు - మంగళసూత్రం, ఆంధ్రము - దక్షిణాపథ సంస్కృతి , తమిళంలో భక్తి సాహిత్యం, అక్క మహాదేవి వచనాలు, ఇలంగో అడిగడ శిలప్పదిగారం, మొదలైన తమిళ, కన్నడ సాహిత్యాలకు సంబంధించిన వ్యాసాలు అలాంటివి. ఇవి తులనాత్మక సాహిత్య అధ్యయనం చేసేవారికి చాలా ఉపయోగనకరమైనవి.
*****
Concept, design & development by Dr. Venkat Korada
Copyright © 2020 Dr. Venkat Korada - All Rights Reserved
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.