తరతరాలుగా భాషాసారస్వతాలకు అంకితమైన వంశాలలో ‘కోరాడ’ వంశం ఒకటి. గత రెండు శతాబ్దాలలో సంస్కృతాంధ్రాలలో అనేక ప్రామాణిక గ్రంథాలు రచించిన వైతాళికులు- కోరాడ వంశీకులు. ఈ వంశంలో జన్మించిన కోరాడ మహాదేవశాస్త్రిగారు తెలుగు భాషా సాహిత్యరంగాలు రెండింటిలో విశేషకృషి చేసి, ఖండాంతరకీర్తిని ఆర్జించినవారు. అరవై సంవత్సరాల వారి విద్యావ్యాసంగంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతులపై రచనలు చేశారు.
కోరాడవంశానికి మూలపురుషులైన మహాదేవశాస్త్రిగారు శ్రీశైలభ్రమరాంబ సన్నిధిలో తపస్సుచేసి, తమది పండితవంశంగా రూపొందాలని అమ్మవారిని అభ్యర్థించి, వరంపొందిన తపఃసంపన్నులని ‘కోరాడ వంశప్రశస్తి’ అనే గ్రంథం చెప్తున్నది. ఈ వంశంలో అంతర్ముఖులు, యోగులు, కాశీ కాశ్మీరాలకువెళ్లి, శాస్త్రపాండిత్యాన్ని కైవశం చేసుకున్నవారు ఉన్నారు. సంస్కృతాంధ్రాలలో వేదాంతశాస్త్ర గ్రంథాలు, భాషాశాస్త్ర వ్యాకరణ గ్రంథాలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శ గ్రంథాలు, దక్షిణదేశ భాషా సారస్వతాలపై వ్యాసాలు, నిఘంటువులు, బోధనాగ్రంథాలు రచించారు. కోరాడ రామచంద్రకవి మొట్టమొదటి స్వతంత్ర తెలుగునాటకం రచిస్తే, వారిమనుమడు రామకృష్ణయ్య భాషాశాస్త్రాన్ని కొత్తమార్గం పట్టించారు, వీరి తనయులు మహాదేవశాస్త్రిగారు ముందుకు నడిపించారు.
మహాదేవశాస్త్రిగారు 29 డిసెంబర్ 1921 లో మచిలీపట్నంలో జన్మించారు. మద్రాసులో బాల్యం, విద్యార్థిదశ తరువాత ఎం. ఎ. ఆర్థికశాస్త్రం మద్రాసు విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. సిమ్లాలో లేబర్ ఇన్వెస్టిగేషన్ కమిషన్ లోను (1944-46), ఢిల్లీలోని ‘ఫెడరేషన్ అఫ్ ఇండియన్ చాంబర్స్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ లో (1946-48) ఆర్థికశాస్త్రవేత్తగా ఉద్యోగంచేశారు. 1948 లో దర్భాంగాలో జరిగిన అల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ లో విశ్వవిఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ సునీతి కుమార్ ఛటర్జీ గారు “యువకులు భాషాశాస్త్రపరిశోధనరంగంలో ముందుకురావాలి” అనే పిలుపుతో ప్రభావితంచెందారు. అదే తన జీవిత లక్ష్యంగా తీసుకుని, పరిశోధనరంగంవైపు దృష్టి మరల్చి, తండ్రిగారి అనుమతితో ఢిల్లీలోని ఉద్యోగాన్ని వదిలి, కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరి, భాషాశాస్త్రంలో ఎం.ఏ. పట్టా పొందారు. అక్కడే డాII సునీతి కుమార్ ఛటర్జీ గారి పర్యవేక్షణలో “ది హిస్టారికల్ గ్రామర్ అఫ్ తెలుగు” అనే అంశంపై పరిశోధన చేసి, 1961లో డి. లిట్. డిగ్రీ పొందారు. 1958లో చిదంబరంలో అన్నామలై విశ్వవిద్యాలయంలో లింగ్విస్టిక్స్ శాఖలో ఉపన్యాసకులుగా చేరారు. ఆ తరువాత తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనూ(1960-68), శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురం లోనూ (1968-82) అధ్యాపకత్వాన్ని చేపట్టి ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు పొందారు. 2016లో తమ 94వ ఏట తిరుపతిలో స్వర్గస్థులయ్యారు.
మహాదేవశాస్త్రిగారు సంస్కృతం, తెలుగు, ఆంగ్లభాషలతో పాటు ప్రాకృతం, హిందీ, భోజపురి, బెంగాలీ, తమిళ, కన్నడ, మళయాళభాషలలో నిష్ణాతులైన బహుభాషాకోవిదులు. శ్రీ మహాదేవ శాస్త్రిగారు రచించిన గ్రంథాలలో ముఖ్యమైనవి:
మహాదేవశాస్త్రిగారి భాషాశాస్త్ర అవగాహన, పరిశోధన పధ్ధతి తరువాతి తరాలవారికి మార్గదర్శకమై. స్ఫూర్తిదాయకంగావుంటూ తులనాత్మక పరిశోధనలకు ఆధారం కాగలవు.
శాస్త్రిగారు 1971లో డాII వి. ఐ. సుబ్రహ్మణ్యం, డాII ఆర్. సి. హీరేమఠ్ లతో కలిసి తిరువనంతపురంలో Dravidian Linguistics Association (ద్రావిడ భాషా సంఘం) ప్రారంభించారు. నాలుగు ద్రావిడ భాషల అధ్యయనం, తులనాత్మక పరిశోధన ఈ సంస్థ లక్ష్యం. మరికొన్ని సంవత్సరాలకి దీనికి అనుబంధంగా International Society of Dravidian Linguistics స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ద్రావిడ భాషల అధ్యయనానికి, పరిశోధనలకు కేంద్రబిందువయింది.శాస్త్రిగారు సౌమ్యమూర్తులు, నిరాడంబరులు, కీర్తికాంక్ష లేనివారు. వారిపూర్వీకుల తపోబలం, గురువుల విద్వత్తు, గాంభీర్యం వారిజీవితాన్ని ప్రభావితం చేశాయి. ఢిల్లీలో ఉన్న సమయంలో వారు గాంధీ, సర్దార్ పటేల్, నెహ్రు వంటి నేతలతో బిర్లా హౌస్ లో సాయంప్రార్థనలలో పాల్గొనడం, కరోల్ బాగ్ లోని నూలువడికే శాఖకు స్వయంసేవకుడిగా గాంధీగారితో సన్నిహితంగా మెలగడం వారివ్యక్తిత్వంమీద చెరగని ముద్రవేశాయి. వారి సమాజసేవ, సమయపాలన ఎంతగానో ఆకట్టుకున్నాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆంగ్ల ప్రసంగాలతోనూ ప్రభావితం అయ్యారు. శాస్త్రిగారు అధ్యాపకులుగా ఉన్నపుడు వారి ఆంగ్ల ప్రసంగాలూ అద్భుతవేగంతో సాగేవి. విద్యార్థుల మనస్సులను ఆకట్టుకోవటానికి ఏంతో కృషిచేసేవారు. కళాశాల వ్యవహారాలలో కానీ, విద్యావ్యవహారాలలో కానీ గంటలతరపడి పనిచేసినా- అలసిపోయినట్లు కనిపించరని ఆయన్ను సన్నిహితంగా చూచినవారు చెబుతూఉండేవారు.
పోతన భాగవతపద్యాలను శ్రావ్యంగా పఠించడం వారికి అత్యంతప్రియమైన విషయం. విద్యార్థులకు తెలుగుభాష పట్ల అనురక్తిని కల్గించేలా బోధించాలని, వారిలోని సృజనను జాగృతంచేయాలని శాస్త్రిగారు ఉపాధ్యాయులను ప్రోత్సాహించేవారు. చిన్నతనంలోనే పిల్లలకు పద్యాలు భావయుక్తంగాను, శ్రావ్యంగానూ చదవడం అలవాటయితే పెద్దవాళ్లయినతరువాత రసానందం వారికి ఒక ఉదాత్తమైన జీవనవైఖిరినీ, మానసిక సంస్కారాన్ని కలుగచేస్తుందని తమ ‘ఆంధ్ర వాఙ్మయ పరిచయము’లో మనవి చేసుకున్నారు. ఇంకా శాస్త్రిగారు తెలుగు భాషాసాహిత్యాల అభ్యుదయానికి తీసుకోవలసిన చర్యలుకూడా సూచించారు. శాస్త్రిగారి విద్యార్థులు శిష్యులనేకులు ఆంధ్రదేశంలోను, ఇతర రాష్ట్రాలలోనే కాక ఇతరదేశాలలో కూడా వ్యాపించి, భాషా సాహిత్యరంగాలలో ఎనలేని సేవలను అందిస్తున్నారు.
కోరాడ మహాదేవ శాస్త్రి
నాన్నగారు బ్రహ్మశ్రీ కోరాడ మహాదేవ శాస్త్రి గారు ఋషి తుల్యులు. జన్మతః ప్రశాంత మనస్కులు, సౌమ్యమూర్తులు. పూర్వీకుల తపోబలం, తల్లిదండ్రుల ఔన్నత్యం, వారి గురువుల విద్వత్తు, గాంభీర్యం, మెలిగిన మహానుభావుల నడవడి వారి జీవన దృక్పధాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. అదే విధంగా, ఎంతో మంది శిష్యులు, ప్రశిష్యులు, పరిచితులు నాన్నగారి చేత ప్రభావితులు అయ్యారు.
వారు గురువులను గురించి కానీ, వారి నాన్నగారు కోరాడ రామకృష్ణయ్య గారి గురించి కానీ తలవని రోజు ఉండేది కాదు. వారంతా మహా పండితులు, దేశ విదేశ భాషల్లో ప్రావీణ్యులు. ఓసారి ఓరియంటల్ కాన్ఫరెన్స్ లో వారి గురువులైన శ్రీ సునీతి కుమార్ చట్టర్జీ గారి పిలుపుతో ప్రభావితం చెంది, తెలుగు భాషా సేవకై జీవితం అంకితం చేసారు. తెలుగు భాష కీర్తిని ప్రపంచమంతా వ్యాపింపచేశారు. అలాగే గాంధీ వారి జీవితాన్ని చాలా ప్రభావితం చేశారు. తమ నడవడితో బ్రిటిష్ సామ్రాజ్యాన్నే మార్చిన మహానుభావుడు నాన్నగారిమీద చెరగని ముద్ర వేయడం ఆశ్చర్యమైన విషయమేమి కాదు! ఢిల్లీలో ఉన్నరోజుల్లో, గాంధీ గారితో నూలు వడకటం, ప్రతి సాయంత్రం బిర్లా హౌస్ లో వారితో భజనలలో పాల్గొనడం తమ అదృష్టంగా భావించేవారు. వారి సమాజసేవ, వారి సమయ పాలన నాన్నగారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘క్షణశః కణశశ్చైవ విద్యామ్ అర్థం చ సాధయేత్’ అన్నట్టు చివరి వరకు కూడా సమయం వృధా చేయకుండా ఏదో ఒకటి చదువుతూనో, రాసుకుంటూనో ఉండేవారు. వారు తమ సంపాదనని అందరితో ఆనందంగా పంచుకునే వారు. ఏ లోటూ లేకుండా జీవించాలంటే అదే మార్గం అంటారు! సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ప్రసంగాల గురించి, వారి వాక్ ధాటి గురించీ ప్రస్తావిస్తూ ఉండేవారు. అదే ప్రభావం కాబోలు, నాన్నగారి ప్రసంగాలు కుడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేవి, ఇంగ్లీష్ లోనూ, తెలుగులోనూ కూడా! వారి అనుభవాలు, ఆశయాలు మమ్మల్ని తీర్చిదిద్దాయి మరి.
అమ్మ, నాన్న చిన్నతనంలోనే మాకు సుమతీ శతకం, వేమన శతకం, పెద్దబాలశిక్ష లోని విషయాలు మొదలైనవి నేర్పించేవారు. భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేయటం భక్తి యోగంతో మొదలెట్టాము. వేసవి శెలవుల్లో నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉండేది. ఎనిమిదవ తరగతి పరీక్షలయిన తరువాత ఓ రోజు గ్యారేజీలో మూడు గంటలు కూర్చుని ఓ అధ్యాయం కంఠస్థం చేసేశాను. సెలవులకి తాతగారి వూరు వెడుతూంటే, తాతగారు బ్రహ్మశ్రీ ఖండవిల్లి సూర్యనారాయణ శాస్త్రిగారికి, నాన్న గారు ఓ ఉత్తరం రాసి పంపారు “రమణకి భగవద్గీత 18వ అధ్యాయం నేర్పించండి” అని. ఆలాగే తాతగారు నేర్పించడం, భగవద్గీత కంఠస్థం పూర్తి చేయడం జరిగింది. తరువాత ‘అమరకోశం’ నేర్చుకునే ప్రయత్నమైతే జరిగింది కానీ అది సాగ లేదు. అదీ నేర్చుకునివుంటే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉంటుంది! ఆటపాటలతో పాటు, చిన్నతనంలోనే పిల్లలకి పద్యాలూ, శ్లోకాలూ శ్రావ్యంగా పాడడం చదవడం నేర్పిస్తే, పెద్దవారయిన తరువాత వారికి భాష మీద అభిమానం, అపూర్వమైన మానసిక సంస్కారం, ఉదాత్తమైన జీవన వైఖిరి అలవడుతుందని నాన్నగారి విశ్వాసం.
నాన్నగారు స్పెషల్ ఆఫీసర్ గాను, ప్రిన్సిపల్ గానూ ఉన్న రోజుల్లో, యూనివర్సిటీల నుంచి వచ్చిన ప్రొఫెస్సొర్స్, విసిటర్స్ ని ఇంటికి తీసుకుని వస్తూవుండేవారు. అలాగే స్వామి చిన్మయానంద, స్వామి దయానంద సరస్వతి వంటి మహానుభావులూ వస్తూ ఉండేవారు. వారి సాంగత్యం, వారి భాషణలూ చాలా విలువైనవిగా ఉండేవి.
నాన్న గారు ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు మాకు వివిధ భాషల్లో పదాలు వాటి చరిత్ర గురించి చెప్తూ ఉండేవారు. 2010 లో కొన్ని తెలుగు పదాల పుట్టు పూర్వోత్తరాలు గురించి ‘శబ్ద వైచిత్రి (రొమాన్స్ అఫ్ వర్డ్స్)’ అనే పుస్తకం రాయడం మొదలుపెట్టారు. అలా అలా పెద్దదై అది ‘భాష - సంస్కృతి’ పుస్తకంగా రూపు దిద్దుకుంది. 2014లో నేను అమెరికా నుంచి వచ్చి నాలుగు నెలలు పుస్తక ప్రచురణలో వారికి సహాయంగా ఉన్నాను. ఆ సమయంలో వారితో జరిపిన చర్చలు, మరి తొంభైమూడేళ్ళ వయసులో కూడా వారి ఉత్సాహం, జ్ఞాపకశక్తి ఆశ్చర్యం కలిగించేవి. ఎప్పుడూ ఇతరుల సౌఖ్యం గురించే ఆలోచిస్తూ ఉండేవారు.
నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదవటానికి వెళ్లేముందు నాన్నగారు నన్ను సంస్కృతం చదవమని ప్రోత్సహించడం, అప్పటికే నేను కెమిస్ట్రీ చదవాలని నిర్ణయించుకోవడంతో, సంస్కృతం నేను హాబీగా చదువుతానని చెప్పడం జరిగింది. వెనక్కి తిరిగి చూసుకుంటే, నాకు ఉన్న ఇంటరెస్ట్ వలన, నేను తీసుకున్న నిర్ణయం సరి అయినదే అనిపిస్తుంది. ఢిల్లీ యునివెర్సిటీలో ప్రొఫెసర్ గాను, ఐఐటీ ఢిల్లీ లో రీసెర్చ్ సైంటిస్ట్ గానూ, తరువాత యేల్ యూనివర్సిటీ స్కూల్ అఫ్ మెడిసిన్ లో, నోబెల్ ప్రైజ్ గ్రహీత ‘ప్రొఫెసర్ థామస్ స్టైట్జ్’ గారి దగ్గర విసిటింగ్ సైంటిస్ట్ గా రీసెర్చ్ చేయడం నా అదృష్టం.
తొమ్మిది తరాల మహా పండితుల వంశ పరంపర, తొమ్మిది తరాల నోబెల్ ప్రైజ్ గ్రహీతల ఆచార్య పరంపర, అనాది అయిన ఆధ్యాత్మిక గురు పరంపర కలడం నాన్నగారి ఆశీర్వాదం, భగవద్కృప!
-కోరాడ వేంకటరమణ
ఆచార్య కోరాడ మహాదేవ శాస్త్రిగారి రచనలు
Descriptive Grammar and Handbook of Modern Telugu
A Grammar of Western Bhojpuri
A Folk Tale in Western Bhojpuri
Vedic and Classical Sanskrit - Article
Prakrit Inscriptions in Buddhist Andhra - Article
శ్రీ కోరాడ రామకృష్ణయ్య శత జయంతి సాహితీ నీరాజనం (సం)
తెలుగు దేశ్య వ్యుత్పత్తి నిఘంటువు
అంతర్జాలంలో:
సింధునాగరికత లిపిలో బాణం గుర్తు
సింధు నాగరికత నాటికి తెలుగు భాష ఉన్నదా? - శ్రీ మహాదేవ శాస్త్రిగారితో శ్రీ పూర్ణచంద్ గారి సంభాషణ
శ్రీ మహాదేవ శాస్త్రిగారి ప్రచురణలు
ఆచార్య శ్రీ మహాదేవ శాస్త్రిగారి అస్తమయం
Concept, design & development by Dr. Venkat Korada
Copyright © 2020 Dr. Venkat Korada - All Rights Reserved
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.